: ఆగస్టు 7.. తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్తమలుపు, ఇక్కడి రాజకీయ భవిష్యత్తును కొత్త తరహాలో చూడాల్సిందే: మోదీ
'ఆగస్టు 7.. తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్తమలుపు' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోన్న మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందంటే రాజకీయ పండితులు నమ్మలేదని, తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధించిందని ఆయన అన్నారు. రాజకీయ పండితులు ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును కొత్త తరహాలో చూడాల్సిందేనని ఆయన అన్నారు. ఇంతకు ముందు ఏ టీవీ ఛానల్ చూసినా అవినీతి అనే వార్తలే కనిపించేవని ఆయన అన్నారు. తమ పాలనలో అవినీతికి ఆస్కారం లేదని ఉద్ఘాటించారు. ఇంతమందిని స్టేడియానికి తీసుకొచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలకు అభినందనలు అని మోదీ అన్నారు. భారీ జనంతో సభను నిర్వహించడం కష్టం కాదు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను తయారు చేయడమే కఠినమైన పని అని ఆయన అన్నారు. ఇక్కడి బీజేపీ శ్రేణుల్ని చూస్తుంటే తెలంగాణ భవిష్యత్తు కనపడుతోందని వ్యాఖ్యానించారు. కొత్త చరిత్ర సృష్టించడంలో తెలంగాణ ముందుంటుందనే నమ్మకం తనలో ఉందని మోదీ అన్నారు. తమకు హై కమాండ్ అంటూ ఏమీ లేదని, 120 కోట్ల మంది ప్రజలే తమ హై కమాండ్ అని ఆయన అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు.