: బైక్‌పై వచ్చి ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతపై కాల్పులు జరిపిన దుండగులు
బైక్‌పై వచ్చిన పలువురు దుండగులు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతపై కాల్పులు జరిపిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. జ్యోతి చౌక్ ఏరియాలో ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత బ్రిగేడియర్ (రిటైర్డ్) జగదీష్ గగనెజపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. ప్రస్తుతం జగదీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జగదీష్ ఆర్‌ఎస్ఎస్ పంజాబ్ యూనిట్ ఉపాధ్యక్షుడుగా, సహ్-సర్‌సంఘ్‌చాలక్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన భార్యతో కలిసి కారులో వస్తుండగా జగదీష్ పై దుండగులు కాల్పులు జరిపినట్లు, ఆయన శరీరంలోకి మూడు బెల్లెట్లు దూసుకుపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను రంగంలోకి దింపారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దుండగులని పట్టుకోవాలని యోచిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద, జగదీష్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా భద్రతా బలగాలు మోహరించాయి. కాల్పుల ఘటనపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి స్పందించారు. దుండగుల చర్యను ఖండించారు.