: టైగర్ ష్రాఫ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే: 'లోఫర్' సినిమా హీరోయిన్
యువ హీరో టైగర్ ష్రాఫ్ తో తనకున్న సంబంధాల పట్ల వస్తోన్న పుకార్లను హీరోయిన్ దిశా పటానీ కొట్టిపారేసింది. తెలుగులో వచ్చిన 'లోఫర్' సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్ లో నటిస్తోన్న 'ఎంస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' వచ్చేనెల 30న విడుదల కానున్న సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ష్రాఫ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె పేర్కొంది. అతడితో తాను డేటింగ్ చేయడం లేదని తెలిపింది. మార్షల్ ఆర్ట్స్ పట్ల టైగర్ ఫ్రాష్ కు ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కారణంగానే తాను జిమ్నాస్టిక్స్ సాధన చేస్తున్నానంటూ వస్తోన్న వార్తలు సత్యదూరమని ఆమె పేర్కొంది. టైగర్ ష్రాఫ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడని, అతనికి సాటిగా డ్యాన్స్ చేయడం అసాధ్యమేనని ఆమె ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. బాలీవుడ్ లో తనకు టైగర్ ష్రాఫ్ ఒక్కడే స్నేహితుడని ఆమె పేర్కొంది. తన రోల్ మోడల్ నటి ప్రియాంక చోప్రాయేనని ఆమె తెలిపింది. సినీరంగ ప్రవేశానికి ముందు తనకు ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలని ఉండేదని తెలిపింది.