: సెంట్రల్ రిటైర్డ్ ఉద్యోగుల కనీస పింఛన్ రూ. 3,500 నుంచి రూ. 9 వేలకు హైజంప్
పదవీ విరమణ చేసిన కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. వారికి లభించే కనీస పెన్షన్ మొత్తం ఏకంగా 157.14 శాతం పెరగనుంది. ఈ మేరకు 7వ వేతన సంఘం పెన్షనర్లను ఉద్దేశించి చేసిన సిఫార్సులను పెన్షన్ల శాఖ ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రస్తుతం పదవీ విరమణ చేసిన కేంద్ర ఉద్యోగులకు వస్తున్న రూ. 3,500 కనీస పింఛన్ రూ. 9 వేలకు పెరగనుంది. ఇదే సమయంలో గ్రాచ్యుటీ పరిమితిని సైతం రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలన్న సిఫార్సును కూడా కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో దాదాపు 58 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుండగా, జనవరి 1, 2016 నాటికి గరిష్ఠంగా రూ. 2.50 లక్షల వేతనంతో పదవీ విరమణ చేసిన వారికి రూ. 1.25 లక్షల పెన్షన్ అందనుంది. ఇక పెన్షనర్ మరణిస్తే, లభించే డెత్ గ్రాచ్యూటీని సైతం రూ. 20 లక్షలకు సవరిస్తూ వేతన సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది.