: అత్యాచారానికి శిక్షగా 51 గుంజీలు తీయమని ఆదేశించిన బీహార్ పంచాయతీ
ఓ దళిత బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి, ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన యువకుడికి బీహార్ లోని ఓ గ్రామ పంచాయతీ 51 గుంజీలు తీయాలని శిక్ష వేసి, రూ. 1000 జరిమానాగా చెల్లించాలని తీర్పిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గయ జిల్లాలో బసెతా గ్రామానికి చెందిన ఓ ఏడో తరగతి బాలిక, పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా, అశోక్ అనే ఓ యువకుడు అటకాయించి బలవంతం చేశాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదరించడంతో, బాలిక ఎవరికీ చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న యువకుడు ఆరు నెలల పాటు సందు చిక్కినప్పుడల్లా తన దుర్మార్గాన్ని కొనసాగించాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని నిలదీస్తే, అబార్షన్ చేయించుకుని వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో, ఆ మాటలు నమ్మి తమ బిడ్డ గర్భాన్ని తొలగించి తీసుకువచ్చారు. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని కోరితే, అశోక్ కుటుంబ సభ్యులు గొడవకు దిగి, తమ బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదని వాదించారు. దీంతో స్థానిక పంచాయతీని బాధితురాలి కుటుంబం ఆశ్రయించగా, పెద్దలు విచారణ జరిపారు. యువకుడు మోసం చేశాడని తేలుస్తూ, 51 గుంజీలు తీయాలని, రూ. 1000 జరిమానా కట్టాలని చెప్పి తీర్పిచ్చారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో, నిందితుడు, పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.