: కొనసాగుతున్న వరదతో 853 అడుగులు దాటిన శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం
ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాల నుంచి వస్తున్న వరదనీటి ప్రవాహం కొద్దిగా తగ్గినప్పటికీ, ఇంకా కొనసాగుతూ ఉండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. ఈ ఉదయం 91 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, జలాశయంలో 853.50 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టులో నీటి నిల్వను 885 అడుగుల వరకూ ఉంచొచ్చు. ప్రస్తుతం 82 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. మరో 133 టీఎంసీల నీరు వస్తేనే, పూర్తి స్థాయి కెపాసిటీకి నీటి నిల్వ నమోదవుతుందని పేర్కొన్నారు. కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్ల ద్వారా 104 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, 15,650 క్యూసెక్కుల నీరు సాగర్ కు చేరుతోంది.