: ప్రమాదంలో ఇంటి పెద్ద బ్రెయిన్ డెడ్.. అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు ముందుకొచ్చి మరికొందరికి పునర్జన్మ ప్రసాదించారు. వైద్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడికి చెందిన ఎస్.శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్జీఐఏ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యులు అతడు బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలిపారు. శ్రీనివాస్ భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలను పిలిపించిన ‘జీవన్‌దాన్’ బృందం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అవయవ దానానికి ఒప్పించింది. అందులోని గొప్పతనాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అంగీకరించారు. భర్త భౌతికంగా తన ముందు లేకున్నా అతడి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొందరిలో బతికే ఉంటాడని తెలుసుకున్న శ్రీనివాస్ భార్య అవయవదానానికి అంగీకరించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో శ్రీనివాస్ రెండు కిడ్నీలు, కళ్లు, లివర్ సేకరించారు. జీవన్‌దాన్ పథకంలో భాగంగా కుషాయిగూడకు చెందిన 21 ఏళ్ల యువతి కావ్యకు లివర్, చేవెళ్లకు చెందిన రాములు(32)కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్టు ఉస్మానియా ఆస్పత్రి చీఫ్ అనెస్తీషియాలజిస్ట్ డాక్టర్ పాండు నాయక్ తెలిపారు. అవయవ దానానికి ముందుకొచ్చిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు.