: వైష్ణోదేవి భక్తులపై విరిగిపడిన కొండచరియలు.. నలుగురు దుర్మరణం
మాతా వైష్ణోదేవిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు దేవి దర్శనం కాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. కొండచరియలు విరిగిపడి భక్తులు ఉంటున్న షెల్టర్‌పై పడడంతో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. జమ్ములోని దాదాపు 5,200 అడుగుల పైనున్న త్రికూట హిల్స్ నుంచి పెద్ద బండరాయి విరిగి పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో బెంగళూరుకు చెందిన శశిధర్ కుమార్(30), చత్తీస్‌గఢ్‌లోని దుర్గాకు చెందిన బిందు షాని(32), ఆమె ఐదేళ్ల కుమారుడు విశాల్, జమ్ముకశ్మీర్‌లోని మానస తాండకు చెందిన 34 ఏళ్ల పోనీవాలా ముహమ్మద్ సాదిఖ్ ఉన్నట్టు గుర్తించారు. బంగంగా-అర్ధ్‌కువారి రోడ్డులో భక్తులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు మాతా వైష్ణోదేవి ఆలయ సీఈవో అజీత్ సాహు తెలిపారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసి రోడ్డును క్లియర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.