: కిక్ యాస్ టోరెంట్స్ తరువాత... 'టోరెంట్జ్ డాట్ ఈయూ' కూడా షట్ డౌన్
మరో పెద్ద పైరసీ సైట్ మూతపడింది. వేలకొద్దీ సినిమాల నుంచి ఎంతో పైరేటెడ్ కంటెంట్ ను కలిగున్న అతిపెద్ద పైరసీ సైట్లలో ఒకటిగా ఉన్న 'టోరెంట్జ్ డాట్ ఈయూ' షట్ డౌన్ అయింది. దీన్ని ఓపెన్ చేసిన లక్షలాది మంది యూజర్లకు 'ఫేర్ వెల్' మెసేజ్ కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పైరేటెడ్ కంటెంట్ కలిగున్న 'కిక్ యాస్ టోరెంట్స్' యజమాని ఆర్టెమ్ వౌలిన్ పోలాండ్ లో అరెస్ట్ అవడం, ఆపై ఆ వెబ్ సైట్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారాలకే మరో పెద్ద వెబ్ సైట్ మూతపడటం గమనార్హం. 2003లో ప్రారంభమైన 'టోరెంట్జ్ డాట్ ఈయూ' 13 సంవత్సరాలకు పైగా పనిచేసింది. ఈ సైట్ లో ప్రస్తుతం హోం పేజీ మాత్రమే కనిపిస్తోంది. సెర్చ్ ఆప్షన్లు, టోరెంట్ లింకులు పూర్తిగా తొలగించబడ్డాయి. ఈ సైట్ లో లాగిన్ ఐడీలను కలిగున్న వారికి సైతం ప్రవేశం నిలిచిపోయింది. ఇదే విషయమై 'టోరెంట్జ్ డాట్ ఈయూ' అధికారులను ప్రశ్నించగా, ప్రస్తుతానికి ఏ వ్యాఖ్యలూ చేయబోమని సమాధానం వచ్చినట్టు తెలుస్తోంది.