: తిట్టుకుంటూ వెళ్లారు... అలానే ఆడారు, ఘోరంగా ఓడారు!


రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో భారత్ కు పతకాలు కచ్చితంగా వస్తాయని భావించిన విభాగం టెన్నిస్. గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన చరిత్ర ఉన్న లియాండర్ పేస్, సానియా మీర్జా, రోహన్ బోపన్న వంటి వారు రంగంలోకి దిగడంతో భారత క్రీడాభిమానులు వీరిపై ఎన్నో ఆశలను పెట్టుకోగా, డబుల్స్ విభాగంలో తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో పేస్, బోపన్న జోడీ బరిలోకి దిగాలని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటకొచ్చాయి. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు కూడా. ఆపై ఇష్టం లేకుండానే రియోకు వెళ్లారు. ఒకరితో ఒకరు కనీసం గదిని కూడా పంచుకోలేదు. కలసి ప్రాక్టీస్ చేయడమూ అంతంత మాత్రమే. ఇక తొలి రౌండ్ ను పోలెండ్ కు చెందిన అంతగా పేరు లేని లూకాస్ కుబోట్, మార్సిన్ మత్కోవ్ స్కీ తో వీరు ఆడిన సందర్భంలోనూ సమన్వయ లోపాలు బహిర్గతమయ్యాయి. భాగస్వామి ఎలా ఆడుతున్నాడో చూడకుండా నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఈ పోరులో 6-4, 7-6 (8/6) తేడాతో ఓడిపోయారు. వీరి ఆట తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆట ముగిసిన అనంతరం పేస్ మీడియాతో మాట్లాడుతూ, గెలుపు, ఓటములు సహజమని, 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ పోటీలపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తానని చెప్పడం గమనార్హం. ఓటమిపై తనను లక్ష్యం చేసుకుని విమర్శలు వద్దని, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని అన్నాడు. కాగా, సానియా మీర్జాతో కలసి పేస్ మిక్సెడ్ డబుల్స్ ఆడనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News