: ‘నిఫ్ట్’ విద్యార్థినిపై ‘కిట్’ క్యాంపస్‌లో సామూహిక అత్యాచారం.. న్యాయం కోసం ఒడిశాలో రోడ్డెక్కిన విద్యార్థులు
ఒడిశాలోని భువనేశ్వర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థిని నడుచుకుంటూ నిఫ్ట్ హాస్టల్‌కు వెళ్తుండగా కిట్ (కేఐఐటీ) యూనివర్సిటీ వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను బలవంతంగా క్యాంపస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన విద్యార్థులు శనివారం ఉదయం పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకుని దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్, సెక్యూరిటీ గార్డుల ఎదురుగానే ఈ ఘటన జరిగినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. రక్షించమని బాధితురాలు కేకలు వేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు ప్రమేయం కూడా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆరోపణలను డిప్యూటీ కమిషనర్ సత్యబ్రత భోయ్ కొట్టి పారేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు గ్యాంగ్ రేప్ జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న బాధితురాలు కోలుకుందని తెలిపారు. అంత రాత్రిపూట ఆమె బయటకు ఎందుకు వెళ్లిందనే విషయంపై ఆరా తీస్తున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన వివరించారు.