: విశాఖకు రైల్వే జోన్ ప్రతిపాదనే లేదు: తేల్చి చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సెంటిమెంటుగా భావిస్తున్న ప్రత్యేక హోదాపై కేంద్రం వెనకడుగు వేస్తున్న వేళ, ఇదిగో అదిగో అంటూ నేతలు పదేపదే ఊరించి చెబుతున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తేల్చి చెప్పింది. భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి వాల్తేరు డివిజన్ ను విడదీసి ఏపీ పరిధిలోకి వచ్చే దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రాంతాలతో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, వాల్తేరు డివిజన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి విడదీస్తున్నారా? విడదీసే పరిస్థితి ఉంటే, ఏ మేరకు పనులు జరిగాయి? అంటూ రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కుమార్ స్వైన్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గొహైన్ సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. వాల్తేరు డివిజన్ లేకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఆదాయం గణనీయంగా తగ్గి మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భయంతోనే ఒడిశా సర్కారు విశాఖ జోన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.