: రియోలో భారత్ శుభారంభం.. హాకీలో ఐర్లండ్‌పై జయకేతనం
స్వర్ణమే లక్ష్యంగా రియో వెళ్లిన భారత హాకీ జట్టు దుమ్ముదులుపుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించి శుభారంభం చేసింది. డ్రాగ్ ఫ్లికర్లు వీఆర్ రఘునాథ్(15వ నిమిషం), రూపిందర్(27,49 నిమిషాల్లో) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచి భారత్‌కు విజయం అందించడంలో కీలకపాత్ర పోషించారు. 2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు ఇదే తొలిసారి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించిన ఘన చరిత్ర ఉంది. ఆ తర్వాత హాకీలో భారత్ ప్రతిభ మసకబారింది. దీంతో ఈసారి ఎలాగైనా స్వర్ణం గెలిచి పూర్వ వైభవాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్న భారత్ అంచనాలకు తగ్గట్టుగానే రాణించి ఐర్లండ్‌ను చిత్తు చేసింది.