: 'బిచ్చగాడు' సినిమా ముందుగా నా వద్దకే వచ్చింది.. వదులుకున్నాను: హీరో శ్రీకాంత్
శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ‘మెంటల్’ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా హీరో శ్రీకాంత్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో విలన్ పాత్రల్లో నటించి సత్తా చూపిస్తానని పేర్కొన్నాడు. తాను పాత్ర నచ్చితేనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటానని పేర్కొన్నాడు. తండ్రి పాత్ర లాంటిది కాకుండా ఎటువంటి మంచి పాత్ర వచ్చినా తాను చేస్తానని చెప్పాడు. తనకు సినిమాలు తప్పా వేరే ప్రొఫెషన్ ఏదీ తెలియదని అన్నారు. తనకు 'పెళ్లి సందడి' సినిమా మంచి గుర్తింపు తెచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నాడు. 'మెంటల్' సినిమాలో చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తాను కనిపించనున్నట్లు శ్రీకాంత్ చెప్పాడు. పోలీస్ డ్రస్ ఉన్నా లేకున్నా చనిపోయేవరకు పోలీస్‌గానే ఫీలవుతాననే క్యారెక్టర్‌లో తాను కనిపిస్తానని పేర్కొన్నాడు. నిజాయతీ కలిగిన పోలీసు అధికారి పాత్రలో నటించానని చెప్పాడు. మెంటల్ సినిమా విడుదల విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కుందని ‘మెంటల్ పోలీస్’ అంటూ టైటిల్ పెట్టడంపై కోర్టు స్టే కూడా విధించిందని ఆయన గుర్తు చేశాడు. చివరకు మెంటల్ టైటిల్‌తో తాను నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన బిచ్చగాడు సినిమా ముందు తన దగ్గరికే వచ్చిందని, కొన్ని కారణాల వల్ల దానిని వదులుకోవాల్సి వచ్చిందని శ్రీకాంత్ తెలిపాడు.