: ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి స్వీట్లు పంచుకోవడం భావ్యం కాదు: హరీశ్‌రావు
మల్లన్నసాగర్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్నాయన్న చందంగా ప్రతిపక్ష పార్టీల నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై తీర్పు రాగానే కోర్టుకెళ్లి స్వీట్లు పంచుకోవడం భావ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. తమ పార్టీని జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలని హరీశ్ అన్నారు. మిషన్ భగీరథ పాత పథకం అంటూ విమర్శిస్తోన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. మిషన్ భగీరథ కోసం మెదక్ జిల్లాలో నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రేపటి ప్రధాని సభలో పాల్గొనాలనుకుంటున్న వారు మధ్యాహ్నం ఒంటిగంటలోపే సభా ప్రాంగణానికి రావాలని ఆయన సూచించారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అక్కడ లక్షా 50 వేలమంది కూర్చోవచ్చని తెలిపారు.