: ప్రత్యేక హోదాపై ఇటీవల జరిగిన ఘటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి: సుజనాచౌదరి
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇటీవల జరిగిన ఘటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినట్లు ఏ మాత్రం కనబడలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టి పెట్టి హోదాపై మాట్లాడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆచితూచి అడుగులేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసమే చంద్రబాబు కృషి చేస్తున్నారని సుజనా చౌదరి తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు హోదాపై రాజకీయాలు ఆపి సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తన వంతుగా చంద్రబాబు ఆదేశాల ప్రకారం కష్టపడుతూనే ఉన్నానని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా కేంద్రం తీరుపై పలుసార్లు ప్రశ్నించానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బంద్‌లు ఏపీలో చేయడం కంటే ఢిల్లీలో చేయడం మంచిదని ఆయన అన్నారు. తాము హోదాతో పాటు రాష్ట్రాభివృద్థి కోసం కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా కష్టపడుతున్నామని తెలిపారు. హోదా తప్పకుండా వచ్చితీరాలని ఉద్ఘాటించారు. హోదా అనేది పూర్తిగా ఎన్డీఏ బాధ్యత అని ఆయన అన్నారు. ఏపీ సమస్యలపై ప్రధాని కూడా నిన్న సానుకూలంగా స్పందించారని, 'ఏపీ సమస్య తన సమస్య' అని తమతో చెప్పారని సుజనా అన్నారు. ప్రతిపక్షాలు చంద్రబాబు ప్రయత్నాలను వెనక్కిలాగేలా చేస్తున్నాయని, ప్రతి రాజకీయ పార్టీ నిర్మాణాత్మకంగా నడుచుకుంటే రాష్ట్రానికి ఉపయోగమని ఆయన పేర్కొన్నారు.