: బీజేపీ పాలిత రాజస్థాన్లో ఆకలి బాధతో 500 ఆవులు మృతి
సంరక్షణ శాలలో పట్టించుకునే నాథుడు లేకపోవడంతో, ఆకలికి తట్టుకోలేక 500లకు పైగా గోవులు మృత్యువాత పడిన ఘటన రాజస్థాన్లోని జైపుర్లో చోటుచేసుకుంది. పైగా, భారతీయ జనతా పార్టీ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. హింగోనియా గోశాలలో సుమారు 8000 ఆవులు ఉంటున్నాయి. అయితే సిబ్బంది వేతన చెల్లింపుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వాటిని పట్టించుకునే వారు లేక అవి ఆకలి బాధతో మృత్యువాత పడుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, గోశాల సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వేతన చెల్లింపుల విషయంలో గోశాలలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాటపట్టారు. దీంతో గోవుల గురించి పట్టించుకునే వారే కరవైపోయారు. గోశాల శుభ్రం చేసి గోవులకు ఆహారం, నీరు అందించేవారు లేకుండా పోయారు. అక్కడ కురుస్తోన్న వర్షాలతో గోశాలంతా బురదమయంగా అయిపోయింది. ఆవుపేడ కూడా కుప్పలుగా పేరుకుపోయింది. గమనించిన స్వచ్ఛంద సేవకులు గోశాలను శుభ్రం చేసేందుకు ఇటీవలే అక్కడకు వచ్చారు. దీంతో గోశాలలో 500 ఆవులు చనిపోయిన ఘటన వెలుగులోకొచ్చింది. ఆవులు అనారోగ్యంతో కాకుండా ఆకలి బాధతోనే మృతి చెందాయని వైద్యులు కూడా స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన రాజస్థాన్ సీఎం వసుంధర రాజె ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.