: వందరోజుల పని ఏమయింది? ఒక్కరోజు పనిచేస్తే అయిపోతుందా?: తెలంగాణ సర్కారుపై వీహెచ్ వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లోని మింట్‌కాంపౌండ్ వద్ద పేరుకుపోయిన చెత్తను ఆయన ఈరోజు తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, చెత్తను తొలగిస్తున్న తమకు దాన్ని తరలించేందుకు ప్రభుత్వం కనీసం వాహనాన్నయినా ఏర్పాటు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన తమని నిరుత్సాహపరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తీరుకి నిరసనగా అక్కడి రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. హైదరాబాద్ మహానగరంలో మున్సిపల్ శాఖ పనితీరు బాగోలేదని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. నగరంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. చెత్తను తొలగించడానికి ప్రభుత్వం చేపట్టిన వందరోజుల ప్రణాళిక ఏమయింది? ఒక్కరోజు పనిచేస్తే సరిపోతుందా? మంత్రులు, అధికారులు ఒక్కరోజు రంగంలోకి దిగితే పని అయిపోయినట్టేనా? ఇదేం తీరు.. ఇదేం పధ్ధతి?’ అంటూ ఆయన రాగయుక్తంగా పాట రూపంలో నిరసనను వ్యక్తం చేశారు.