: బీజేపీతో వైఎస్ జగన్ లాలూచీ!... తొలి ముద్దాయి కాంగ్రెస్సే!: ‘హోదా’పై అచ్చెన్న కామెంట్స్!
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనలో జరుగుతున్న జాప్యంపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుండా కపట నాటకమాడిన కాంగ్రెస్ పార్టీనే ఈ విషయంలో మొదటి ముద్దాయి అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇంచార్జీ మంత్రిగా ఉన్న కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం కర్నూలులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో లాలూచీ కారణంగానే ఆ పార్టీపై వైఎస్ జగన్ పల్లెత్తు మాట అనడం లేదని ఆరోపించారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగానే తమ ప్రభుత్వం కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేయనున్నామని ఆయన ప్రకటించారు.