: ఢిల్లీలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ విధివిధానాలు విడుదల.. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడుగా హైదరాబాదీకి అవార్డు ప్రదానం
పరిశుభ్రతను పెంచేందుకు కేంద్రం స్వచ్ఛ భారత్ లో భాగంగా చేపట్టిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’కు సంబంధించి ఇప్పటికే నగరాలు, పట్టణాలకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019 నాటికి స్వచ్ఛ భారత్ సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈరోజు ఢిల్లీలో వెల్లడించారు. స్వచ్ఛ్ ఐడియాస్ అనే పుస్తకం, సాలిడ్ మున్సిపల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అనే పుస్తకం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విడుదలయ్యాయి. వాటితో పాటు ఆయన కార్యక్రమాన్ని గురించిన పూర్తి వివరాలు తెలిపే స్వచ్ఛ భారత్ మొబైల్ ఆప్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1969ను కూడా ఏర్పాటు చేశారు. తాము ఎంపిక చేసిన 500 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత్‌లో చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రజల కార్యక్రమమని, సర్కారు కార్యక్రమం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మోదీ అంటే ఇండియాను అభివృద్ధి పరిచే వ్యక్తిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ వాసి అయిన జీహెచ్‌ఎంసీ కార్మికుడు వెంకటయ్యకు కేంద్రం ప్రకటించిన ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడి అవార్డును వెంకయ్య ప్రదానం చేశారు. కేంద్రం చేపట్టిన స్వచ్ఛభారత్‌లో కృషి చేసిన వారిని ఆయన సత్కరించారు.