: కోదండరాంపై కడియం ఘాటు వ్యాఖ్యలు!
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోదండరాంపై తమకు గౌరవం ఉందంటూనే కడియం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆ ఉద్యమ పథ నిర్దేశకుడికి వరంగల్ లో కొద్దిసేపటి క్రితం నివాళి అర్పించిన సందర్భంగా మాట్లాడిన కడియం... కోదండరాం కూడా జయశంకర్ బాటలోనే నడవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం అంటే తమకు ఎలేని గౌరవం ఉందన్న కడియం... ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం బాగా లేదని వ్యాఖ్యానించారు. కోదండరాంపై తమతో పాటు ప్రజలకు కూడా ఇంకా నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వానికి కోదండరాం సూచనలు చేస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే ప్రతిపక్షాల వలలో చిక్కుకుపోతున్న కోదండరాం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి కోదండరాం ప్రతిపక్షాల వలకు చిక్కకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.