: పటేళ్లలో నితిన్ కు మంచి పేరు లేదన్న ఆనందీబెన్!.... అదే రూపానీకి వరమైందట!


గుజరాత్ సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ వారసుడి ఎంపికకు సంబంధించి నిన్న అహ్మదాబాదులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పటేల్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి నితిన్ పటేల్ ను దాదాపుగా తదుపరి సీఎంగా ఎంపిక చేశారు. ఈ మేరకు సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో భాగంగా నితిన్ కే అంతా మొగ్గుచూపారన్న విషయం మీడియాకు లీకైంది. ఈ క్రమంలో నితిన్ బయోడేటా సేకరణలో అన్ని మీడియా సంస్థలు తలమునకలయ్యాయి. ఒకానొక దశలో నితిన్ భార్య కూడా మీడియాలో కనిపించారు. ఈ క్రమంలో గుజరాత్ సీఎం అభ్యర్థి ప్రకటన నిన్న సాయంత్రం 4.45 గంటలకు వెలువడుతుందని బీజేపీ ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి ఈ ప్రకటన దాదాపు రెండు గంటలు ఆలస్యమైంది. ఈ రెండు గంటల్లోనే నితిన్ భవిష్యత్తు తలకిందులైంది. సీఎం పదవికి ఎంపికైన ఆయన డిప్యూటీతో సరిపెట్టుకోక తప్పలేదు. పటేల్ సామాజిక వర్గానికే చెందన ఆనందీబెన్ పటేల్... నితిన్ అభ్యర్థిత్వాన్ని ముందుగా బలపరచినా, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. వివాదరహితుడిగా ఉన్న విజయ్ రూపానీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఆనందీబెన్ పటేల్ మరోమారు ఆలోచనలో పడ్డారు. అయినా నితిన్ పటేల్ కు పటేల్ సామాజిక వర్గంలో మంచి పేరు లేదని, ఈ అంశం రానున్న ఎన్నికల్లో పార్టీపై పెను ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ రూపానీ అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన రూపానీకి పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగానూ ఆయన పనితీరు బాగానే ఉందట. ఇక పటేల్ సామాజిక వర్గాల్లో నితిన్ పటేల్ కు మంచిపేరు లేని విషయాన్ని ఆసరా చేసుకున్న పార్టీ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించాయి. ఆ తర్వాత మోదీ నేరుగా ఆనందీబెన్ పటేల్ తో ఫోన్ లో మాట్లాడారు. వెనువెంటనే గుజరాత్ తదుపరి సీఎం విజయ్ రూపానీనేనని బీజేపీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News