: హోదా కోసం కాదు.. కృష్ణా పుష్కరాలకు ప్రధానిని ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళ్లా: చంద్రబాబు
కృష్ణా పుష్కరాలకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించేందుకే తాను ఢిల్లీ వెళ్లానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై ఆయనతో చర్చించినట్టు బాబు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం శుక్రవారం సాయంత్రం విజయవాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా పుష్కరాలకు ప్రధానితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంతరామ్, వెంకయ్యనాయుడు, సురేష్ప్రభు, జేపీ నడ్డా, అద్వానీతోపాటు లోక్సభ స్పీకర్ను ఆహ్వానించినట్టు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ప్రధానితో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించానన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధానికి గుర్తుచేశానన్నారు. జీఎస్టీ బిల్లుకు, ప్రైవేటు బిల్లుకు కాంగ్రెస్ లంకె పెట్టకుండా ఉంటే బిల్లు తప్పకుండా పాసయ్యేదన్నారు. హోదా గురించి ఆలోచిస్తున్నట్టు మోదీ తనకు హామీ ఇచ్చారని బాబు పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజీపే ఏపీతో ఆడుకుంటున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీకి హోదా విషయంలో 11 పార్టీలు మద్దుతు ఇచ్చాయని వివరించారు.