: కేవీపీ ‘ప్రత్యేక’ బిల్లు భవిష్యత్తేంటి.. అది ద్రవ్య బిల్లా.. కాదా..?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితుల్లో బీజేపీ లేదని స్పష్టమైపోయింది. శుక్రవారం రాజ్యసభలో జరిగిన తీరు చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయం అర్థమైపోయింది. అది మనీ బిల్లా? కాదా? అని తేల్చేందుకు రాజ్యసభ నుంచి లోక్‌సభకు వెళ్లిన ఈ బిల్లుపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది. అది మనీ బిల్లు కాదని ఏపీకి జీవం పోస్తారా? లేక, ద్రవ్య బిల్లేనంటూ చెత్తబుట్టలోకి విసిరేస్తారా? అన్న సంశయం అందరినీ వేధిస్తోంది. మరోవైపు గత వారం రోజులుగా రాజ్యసభలో జరిగిన పరిణామాలు చూస్తుంటే మాత్రం ఏపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ హోదా ఇచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కేవీపీ బిల్లు తెరపైకి వచ్చిన ప్రతీసారి కేంద్రం ఏదో ఒక సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. తాజాగా శుక్రవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. కేవీపీ బిల్లులో ఆర్థిక అంశాలు ఉండడంతో దీనిని ద్రవ్య బిల్లుగానే పరిగణిస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. దీంతో ఏం చేయాలో పాలుపోని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ బిల్లు సంగతి తేల్చేందుకు లోక్‌సభ స్పీకర్‌కు పంపుతున్నట్టు ప్రకటించి బాల్‌ను లోక్‌సభలో వేశారు. ప్రత్యేక హోదా చిక్కుముడి నుంచి కురియన్ చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు కేవీపీ బిల్లు భవిష్యత్తు లోక్‌సభ స్పీకర్ చేతిలో ఉందన్నమాట.