: టీ తాగి నలుగురు మృతి... విషపూరితం కావడం వల్లేనంటున్న పోలీసులు


తేనీరు ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆరైయా జిల్లాలోని బేలా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమృత్‌పూర్ గ్రామానికి చెందిన రాణి(22) తన ముగ్గురు పిల్లలు మున్సి(8), ఉపాసన(3), కనహియా(7)తో కలిసి నివసిస్తోంది. భర్త రాంచంద్ర చౌహాన్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాణి తనకోసం టీ తయారుచేసుకుంది. తను తాగేముందు పిల్లలకు కూడా తలా ఇంత ఇచ్చింది. అయితే అది తాగిన అనంతరం అందరూ ఒక్కసారిగా కుప్పకూలి కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టీ విషపూరితంగా మారడం వల్లే వారు మృతి చెంది ఉంటారని సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. అయితే నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మరోవైపు రాణి కుటుంబ సభ్యులు ఆమె అత్తింటివారిపై కేసు పెట్టారు. వారే ఆమెను చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు రాణి అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి శారీరక, మానసిక వేధింపులు భరించలేకే తమ కుమార్తె, పిల్లలు సహా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News