: ప్రపంచంలోనే తొలి తలమార్పిడి చేసి చరిత్ర సృష్టించ‌నున్న వైద్యులు


వైద్య రంగంలో ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు, ఎన్నో విజ‌యాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. క‌ళ్లు, కాలేయం ఇలా ఒక్క‌క్క అవ‌య‌వాల‌ను విజ‌య‌వంతంగా మార్పిడి చేస్తూ శ‌స్త్ర చికిత్స‌ల్లో ఎన్నో విజయాలు సాధించిన వైద్యులు గుండె మార్పిడిని కూడా అల‌వోక‌గా చేసేస్తున్న విష‌యం తెలిసిందే. వారు మ‌రింత ముందుకు ప‌య‌నించి ప్ర‌పంచంలోనే తొలిసారిగా త‌ల‌మార్పిడీ చేయ‌నున్నారు. దాని కోసం అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తయ్యాయి. వాలెరీ స్పిరిడోనోవ్(31) అనే వ్య‌క్తి ఈ త‌లమార్పిడి శ‌స్త్ర‌చికిత్స‌ను చేయించుకోనున్నాడు. ఆయ‌న వెర్డింగ్‌నింగ్-హాఫ్‌మన్ అనే నాడీ కండరాల క్షీణత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. ఆ వ్యాధితో ఆయ‌న‌ కుర్చీకే ప‌రిమితమ‌య్యాడు. దీంతో ఆయ‌న ఈ అరుదైన రిస్కీ సర్జరీ చేయించుకుంటున్నాడు. త‌న‌ ఆరోగ్య పరిస్థితి విష‌మంగా ఉంద‌ని, చావు త‌న వ‌ద్ద‌కు రాక‌ముందే మరో ఆరోగ్యకరమైన దేహానికి త‌న‌ తలను మార్పించుకునే అవ‌కాశం త‌న‌కు వ‌చ్చింద‌ని వాలెరీ వ్యాఖ్యానించారు. త‌న‌కు త‌ల‌మార్పిడి చికిత్స ఎంతో ప్రమాదకరమైందని తెలుస‌ని, అయినప్ప‌టికీ వేరే మార్గం లేక‌ గత్యంతరం లేని పరిస్థితుల్లో త‌ల‌మార్పిడికి ఒప్పుకున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నాడు. 'త‌న‌ తలను కత్తితో న‌రికేసుకొని, మ‌ళ్లీ దాన్ని మరో ఆరోగ్యకరమైన దేహానికి పెట్టుకుంటాను' అని గ‌తంలో వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసిన వైద్యుడు సెర్జియో కానావెరో ఆధ్వ‌ర్యంలోనే ఈ త‌ల‌మార్పిడి చికిత్స జ‌రగ‌నుంది. ఆయ‌నతో క‌లిసి ఇటలీకి చెందిన సర్జన్ ఫ్రాంకేన్‌స్టెయిన్ ఈ త‌ల‌మార్పిడి చికిత్స చేయ‌నున్నారు. ఈ సర్జరీని వచ్చే ఏడాది డిసెంబర్‌లో నిర్వహించాల‌ని, దానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఈ త‌ల‌మార్పిడి ఆపరేషన్ భారీ వ్యయంతో కూడినది. ఇందుకోసం 122 కోట్లు ఖర్చు కానున్నాయ‌ట‌. ఈ చికిత్సను హెవెన్ (స్వర్గం) అంటే హెడ్ అనాస్తోమోసిస్ వెంచర్ అని వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌. త‌ల‌మార్పిడి చికిత్స కోసం డాక్ట‌ర్లు 36 గంటలపాటు త‌మ స‌మ‌యాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ చికిత్స‌లో 150 మంది డాక్టర్లు, నర్సులు పాల్గొన‌నున్నారు. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్న థియేటర్లను, ఈ సర్జరీలో భాగమయ్యే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి దేహాన్ని వైద్యులు ఇప్ప‌టికే సన్న‌ద్ధం చేశారు. త‌ల‌మార్పిడి త‌రువాత నాలుగువారాలపాటు పేషెంట్ కోమాలోనే ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు. మెడకు, దేహానికి మధ్య గాయం ఉంటుంద‌ని, అది మానేంత వరకు పేషెంట్‌ కోమాలోనే ఉంటాడ‌ని చెప్పారు. త‌ల‌మార్పిడి చేయించుకున్నాక వాలెరీ అంద‌రిలాగే మాట్లాడతాడ‌ని, న‌డుస్తాడ‌ని వైద్యులు తెలిపారు. గ‌తంలో ఇటువంటి స‌ర్జరీనే వైద్యులు ఒక కోతిపై నిర్వ‌హించారు. 1970లో నిర్వ‌హించిన ఈ త‌ల‌మార్పిడి త‌రువాత ఆ కోతి రెండు నెల‌ల పాటు జీవించింది.

  • Loading...

More Telugu News