: దుమికిన మార్కెట్ బుల్... రూ. 1.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద


వస్తు సేవల పన్ను బిల్లుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు రావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచిన వేళ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి, దేశవాళీ ఫండ్ సంస్థల వరకూ ఉత్సాహంగా నూతన కొనుగోళ్లకు దిగిన వేళ, మార్కెట్ బుల్ హైజంప్ చేసింది. మార్కెట్ కాప్ 1.60 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్, ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. మధ్యాహ్నం తరువాత ఓ అరగంట పాటు లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ, ఆ వెంటనే మరిన్ని కొనుగోళ్లు వెల్లువెత్తాయి. లార్జ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే, చిన్న, మధ్య తరహా కంపెనీల ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. సెన్సెక్స్, నిఫ్టీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ సెక్టార్లు అదనపు లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 363.98 పాయింట్లు పెరిగి 1.31 శాతం లాభంతో 28,078.35 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 132.05 పాయింట్లు పెరిగి 1.54 శాతం లాభంతో 8,683.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.69 శాతం, స్మాల్ కాప్ 1.47 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 42 కంపెనీలు లాభపడ్డాయి. గ్రాసిమ్, హీరో మోటో కార్ప్, హిందాల్కో, బజాజ్ ఆటో, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టెక్ మహీంద్రా, ఇన్ ఫ్రాటెల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,906 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,841 కంపెనీలు లాభాలను, 894 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గురువారం నాడు రూ. 1,07,57,994 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,09,17,053 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News