: ఏపీకి హోదా రాదని కుండబద్దలు కొట్టిన జైట్లీ!
రాజ్యసభలో చట్టాలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోను కుదిరే పని కాదని, ప్రత్యేక హోదా బిల్లు ద్రవ్య బిల్లు కాబట్టి ఓటింగ్ జరిపించలేమని చెబుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఆలోచన తమకు ఎట్టి పరిస్థితుల్లో లేదని కుండ బద్దలు కొట్టారు జైట్లీ. ఒక ప్రభుత్వం లోక్ సభలో మైనారిటీలో ఉండి కొనసాగలేదని, రాజ్యసభలో మైనారిటీలో ఉండి కూడా కొనసాగగలదని, భారత రాజ్యాంగం కల్పించిన విశేషమైన హక్కు ఇదని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో బలం ఉంది కదా అని ఇబ్బందులు పెట్టాలని చూసే విపక్షాలకు అడ్డుకట్ట వేసేందుకే రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని అన్నారు. లోక్ సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకూ వేర్వేరు హక్కులే ఉంటాయని వివరించారు. లోక్ సభ కార్యదర్శి, స్పీకర్ మాత్రమే బిల్లు ద్రవ్యబిల్లా? కాదా? అన్నది నిర్ణయించగలుగుతారని అన్నారు. ఇప్పటికే లోక్ సభ కార్యదర్శి దీన్ని మనీబిల్లుగా తనకు స్పష్టం చేశారని అన్నారు. కేవీపీ ప్రైవేటు హోదా బిల్లుతో ఏపీకి ప్రత్యేక హోదా రాదని, చర్చలు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు, డిమాండ్లు, కేంద్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో మౌలిక వసతులు వంటి ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయని జైట్లీ అన్నారు.