: ఏపీ ప్రజలకు అన్యాయం... ప్రత్యేక హోదా బిల్లు మనీ బిల్లేనంటున్న అరుణ్ జైట్లీ
ప్రత్యేక హోదా బిల్లు కచ్చితంగా మనీ బిల్లేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. మనీ బిల్లులపై రాజ్యసభలో చర్చ చేపట్టవచ్చుగానీ, ఎలాంటి ఓటింగులకూ ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఒక బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అన్న విషయమై అనుమానాలు తలెత్తితే, లోక్ సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ (స్పీకర్) నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ద్రవ్య బిల్లులన్నీ తొలుత లోక్ సభలో మాత్రమే చర్చకు రావాలన్న రాజ్యాంగ నిబంధనలను జైట్లీ చదివి వినిపించారు. ఏపీకి అవసరమైన అన్ని సహాయాలు చేస్తామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నామని అన్నారు. ఆనాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలన్న విషయమై సమాలోచనలు జరుపుతున్నామని జైట్లీ స్పష్టం చేశారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సాధ్యమైనంత మేరకు కృషి చేస్తామని తెలిపారు. కేవీపీ దాఖలు చేసిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ సాధ్యపడదని చెప్పారు.