: భారత జీఎస్టీ బిల్లుతో తమకెంతో లాభమంటూ, మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన చైనా!
ఇండియాలో వ్యాపారం చేస్తూ భారీగా ఆదాయాన్ని పొందుతున్న చైనా, ఏకీకృత వస్తు సేవలు, పన్ను బిల్లు (జీఎస్టీ) అమలుతో తమకెంతో లాభమని అంటోంది. ఈ మేరకు అధికార 'గ్లోబల్ టైమ్స్' పత్రికలో ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. ఈ బిల్లుకు ఆమోదంతో తమతో పాటు విదేశీ సంస్థలకు ఇండియా మరింత అట్రాక్టివ్ గా మారిందని అభిప్రాయపడింది. ఈ బిల్లుకు మరింత వాస్తవికతను తెచ్చేందుకు ఇండియాతో కలసి పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపింది. ఈ బిల్లుకు ఆమోదంతో నరేంద్ర మోదీ ఖ్యాతి మరింతగా పెరిగిందని, ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత స్థిరమయం చేసే బిల్లు ఇదని, మరోసారి ఆయన్నే భారత ప్రజలు ప్రధానిగా చేస్తారని భావిస్తున్నామని ఈ వ్యాసంలో చైనా పేర్కొంది. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో పన్నుల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని గుర్తు చేసిన 'గ్లోబల్ టైమ్స్' ఈ అంతరాలు తొలగితే, మరింత జీడీపీని అందుకుంటుందని అంచనా వేసింది. భవిష్యత్తులో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ కు ఇండియాను టార్గెట్ గా చేయాలన్న మోదీ అభిమతమే ఈ బిల్లుకు ఆమోదం పలికేందుకు సహకరించిందని కొనియాడింది. చైనా కంపెనీలు అన్నీ బిల్లును స్వాగతిస్తున్నాయని, సమీప భవిష్యత్తులో పలు చైనా కంపెనీలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతాయని అంచనా వేసింది. ఒకసారి ఈ బిల్లుకు తుది రూపు వచ్చి అమలైన వేళ, అంతర్జాతీయ స్థాయిలో భారత పేరు ప్రఖ్యాతులు మరింతగా విస్తరిస్తాయని సానుకూల వ్యాఖ్యలు చేసింది.