: అలస్యమైతే నమ్మకం పోతుంది... ఇద్దరమూ నష్టపోతామని చెప్పా: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ప్రక్రియ ఎంత ఆలస్యమైతే ప్రజల్లో అంత మేరకు నమ్మకం పోతుందని, దీని ఫలితంగా ఇద్దరమూ నష్టపోతామని ప్రధాని నరేంద్ర మోదీతో స్పష్టంగా చెప్పినట్టు సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నం మోదీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన, తన కోసం వేచి చూస్తున్న మీడియా వారితో కలిసి కొద్దిసేపు నడుస్తూ, చర్చల గురించిన వివరాలు తెలిపారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని తాను మోదీకి వివరించానని, త్వరగా నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ, బీజేపీలకు నష్టమని చెప్పానని బాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల అనంతరం నిర్ణయం తీసుకుంటామని మోదీ తనకు హామీ ఇచ్చారని అన్నారు. ఆపై తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. కాగా, నేటి సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన, ప్రధానితో సమావేశం వివరాలను సమగ్రంగా వెల్లడించే అవకాశాలున్నాయి.