: న్యూఢిల్లీ, బెంగళూరు తరువాత ముంబై వంతు... నగరంలో భారీ వర్షాలు... ముందే రంగంలోకి రెస్క్యూ టీములు
న్యూఢిల్లీ, బెంగళూరు నగరాలను వణికించిన వరుణుడి కన్ను ఇప్పుడు ముంబైపై పడింది. గడచిన 24 గంటలుగా ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచివుంది. నగరాన్ని వరదలు చుట్టుముట్టవచ్చన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో, ఎలాంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న ఫడ్నవీస్ ఆదేశాల మేరకు రెస్క్యూ టీములు రంగంలోకి దిగాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలకు మర పడవలు, చిన్న బోట్లు, లైఫ్ జాకెట్లను చేరుస్తున్నారు. థానే, నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు దగ్గరుండి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే 48 గంటల్లో ముంబై ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే నీరు నిలిచిన ప్రాంతాల్లో పడే మరింత వర్షం వరదగా మారే అవకాశాలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులతో సమీక్ష అనంతరం మేయర్ సంజయ్ మోర్ ప్రకటించారు.