: 'ఐ యామ్ ది హోమ్ మినిస్టర్' అన్న 8వ తరగతి బాలుడు... కదిలొచ్చిన కన్నడ సర్కారు
"మా పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న కౌన్సిల్ లో నేను హోం మంత్రిని. మీతో ఐదు నిమిషాలు మాట్లాడవచ్చా?" అంటూ కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర కు 8వ తరగతి చదువుతున్న బాలుడు పెట్టిన మెసేజ్ కి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి, ఆ బాలుడి కోరికను నెరవేర్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దక్షిణ కన్నడ జిల్లాలోని హరది గ్రామంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న దివిత్ రాయ్ ఈ మెసేజ్ పెట్టాడు. ఎందుకో తెలుసా... చానా ఏళ్లుగా తమ స్కూల్ లో టీచర్లుగా ఉండి, బదిలీ అయిన నలుగురిని వదిలి ఉండలేక, వారి ట్రాన్స్ ఫర్ ఆపాలని. తామిక వెళ్లక తప్పదని టీచర్లు స్పష్టం చేసిన వేళ, తట్టుకోలేకపోయిన దివిజ్, హోం మంత్రి ఫోన్ నంబర్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉందన్న విషయం తెలుసుకుని ఆయనకే మెసేజ్ పెట్టాడు. ఇంకేముంది... ఆ తరువాతి రోజే హోం మంత్రి కార్యాలయం నుంచి వారింటికి ఫోన్ వచ్చింది. మీ బాబు ఏం చెప్పాలని అనుకుంటున్నాడని పరమేశ్వర ప్రధాన సలహాదారు అడగడంతో, దివిత్ విషయం చెప్పాడు. బదిలీ నిర్ణయంతో ఎంతో మంది విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతుందని వివరించాడు. విషయం పరమేశ్వర వరకూ వెళ్లింది. వెంటనే మీడియా సమావేశం పెట్టిన ఆయన, దివిత్ కు భవిష్యత్తు, తోటి వారి చదువు పట్ల ఉన్న ఆలోచన తనను కదిలించిందని, వీరి బదిలీలను నిలిపేస్తున్నామని ప్రకటించారు.