: ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న ‘ఆరెంజ్’ బస్సు!... ప్యాసెంజర్లను దించేసి సీజ్ చేసిన ఆర్టీఏ!
ఏపీలో ప్రభుత్వానికి పన్ను కట్టకుండా యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నేటి ఉదయం రవాణా శాఖ అధికారులు దాడులు ప్రారంభించారు. ఈ దాడుల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఉదయమే రోడ్డుపై ప్రత్యక్షమైన ఆర్టీఏ అధికారులు అటుగా వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సును నిలిపేశారు. పత్రాల పరిశీలనలో ఆ బస్సు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండానే తిరుగుతున్నట్లు తేలింది. దీంతో బస్సులోని ప్రయాణికులను అక్కడికక్కడే దించేసి ఆ బస్సును అధికారులు సీజ్ చేశారు. ట్యాక్స్ కట్టకుండా ఎలా తిప్పుతున్నారంటూ ట్రావెల్స్ యాజమాన్యంపై ప్యాసెంజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత ప్రయాణికులను ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కించిన అధికారులు వారిని గమ్యస్థానాలకు పంపించారు.