: ఆగ్రాను బెంబేలెత్తిస్తున్న వానరాలు.. పట్టుకుని ‘ఫ్యామిలీ ప్లానింగ్’ చేస్తున్న అధికారులు!
ఆగ్రాను వానరాలు బెంబేలెత్తిస్తున్నాయి. దాదాపు 8 వేల వరకు ఉన్న కోతులు అక్కడి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే వచ్చే ఆరేళ్లలో ఇవి 2.16 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ చేస్తున్నారు. ఆహారం పుష్కలంగా దొరుకుతుండడం, భక్తులు వాటిని దైవ రూపంగా భావిస్తుండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే భవిష్యత్తులో నగరంలో మనుషుల కంటే కోతులే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించిన అధికారులు, ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ, ఎన్జీవో, వైల్డ్‌లైఫ్ అధికారుల భాగస్వామ్యంతో వానరాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని భావించారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 552 కోతులను పట్టుకున్న అధికారులు 317 వానరాలకు ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ప్రతీ కోతి 18 నెలల్లో మూడింటికి జన్మనిస్తుందని, ఇలాగే వదిలేస్తే 2022 నాటికి నగరంలో వాటి సంఖ్య 2.16 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటి సంతానోత్పత్తిని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నట్టు వివరించారు.