: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం... ఏపీకి ‘హోదా’ ఇవ్వొద్దంటూ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయలేదన్న అభిజిత్ సేన్
‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ అంశంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. సమావేశానికి కాంగ్రెస్ నేతలతో పాటు రాజ్యాంగ నిపుణులు పీపీరావు, 14వ ఆర్థిక సంఘం సభ్యుడైన అభిజిత్‌సేన్ హాజరయ్యారు. ఆ సందర్భంగా సమావేశంలో అభిజిత్‌సేన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫార్సులు చేయలేదని స్పష్టం చేశారు. విభజన తరువాత ఏపీకి రెవెన్యూ లోటు ఉందని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి పన్నుల వాటా పెరిగినా ఏపీకి లోటు ఉంటుందని, ఏపీకి రూ.22 వేల కోట్ల రెవెన్యూ గ్రాంటు ఇవ్వాలని సూచించినట్లు ఆయన తెలిపారు. హోదాపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. హోదా కోసం సభలోనూ, బయట పోరాడతామని వ్యాఖ్యానించారు. ఒక ప్రధాని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన అన్నారు.