: దున్నపోతు వేలానికి వినూత్న పద్ధతి ఎంచుకున్న హిమాచల్ రైతు
‘హిమాచలీ రంజా’ అనే దున్నపోతును బేరానికి కాదు, వేలానికి పెట్టాడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక రైతు. అదీ.. ఫేస్ బుక్ ద్వారా. ఇందుకు సంబంధించిన వివరాలను రైతు నరేష్ సోని (44) ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 30 నెలల వయస్సున్న ‘హిమాచలీ రంజా’ బరువు 1000 కేజీలు. దీని పొడవు 13 అడుగులు, వెడల్పు 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్న దీని ధర రూ.5 కోట్లు అని, ఈ శుక్రవారం హమీర్ పూర్ జిల్లాలోని ఘోరి ధవిరి పంచాయతీ పరిధిలో దీనిని వేలం వేయనున్నట్లు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ‘హిమాచలీ రంజా’ ఖర్చు రోజుకు రూ.1,500 అవుతుందని పేర్కొన్నాడు. రోజూ దానికి ఇచ్చే ఆహారం వివరాలను కూడా ఈ పోస్ట్ లో పొందుపరిచాడు. సోయాబీన్- 2.5 కిలోలు, చనా-2.5 కిలోలు, పశుగ్రాసం-10 కిలోలు, దేశీయ నెయ్యి- 1 కిలో సహా ఆపిల్ పండ్లను ఆరగించే ‘హిమాచలీ రంజా’కు మసాజ్ చేసేందుకు 2 కిలోల నూనె వినియోగిస్తామని రైతు నరేష్ వివరించాడు. ఈ వేలం పాట కార్యక్రమానికి బిలాస్ పూర్ ఎమ్మెల్యే బామ్ బెర్ ఠాకూర్ ను ఆహ్వానించినట్లు చెప్పాడు. కాగా, హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ‘యువరాజ్’ అనే దున్నపోతుకు రూ.9 కోట్లు ధర పలికినపుడు, తన ‘హిమాచలీ రంజా’కు కచ్చితంగా రూ.5 కోట్లు పలుకుతుందనే ధీమాను నరేష్ వ్యక్తం చేశాడు. పలు రాష్ట్రాలకు చెందిన కొనుగోలు దారులను ఆకర్షించేందుకే ‘హిమాచలీ రంజా’ వేలం పాట నిర్వహిస్తున్న విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపానని ఆ రైతు పేర్కొన్నాడు.