: ఇల్లు మాత్రమే అలికారు... జీఎస్టీ పండగకు ఇంకా అడ్డంకులెన్నో!


బుధవారం నాడు రాజ్యసభలో ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను చట్ట సవరణ బిల్లు ఇప్పుడప్పుడే అమల్లోకి రాదని, ఈ బిల్లు దాటాల్సిన అడ్డంకులెన్నో ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. భారత పన్ను సంస్కరణల చరిత్రలో అతిపెద్దదిగా చెప్పుకుంటున్న ఈ బిల్లు అమల్లోకి రావాలంటే దాటాల్సిన అడ్డంకులివే. * ఈ బిల్లును తిరిగి లోక్ సభకు పంపాల్సి వుంది. ఇప్పటికే బిల్లు లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో చట్ట సవరణలు జరిగాయి కాబట్టి, తిరిగి లోక్ సభ మరోసారి చర్చించాలి. లోక్ సభలో బీజేపీకి మెజారిటీ ఉంది కాబట్టి సవరణలకు ఆమోదానికి పెద్దగా అడ్డంకులు ఉండవు. ఒకవేళ సవరణలపై స్పష్టత లేదని భావిస్తే, మరోసారి పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాల్సి వుంటుంది. * సవరణలకు పూర్తి ఆమోదం పలికిన తరువాత, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ బిల్లును పంపుతారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. కనీసం 50 శాతం అసెంబ్లీలు, అంటే కనీసం 15 రాష్ట్రాలు ఈ బిల్లును యథాతథంగా ఆమోదించాలి. ప్రస్తుతం ఒక్క తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలన్నీ దీనికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని అంచనా. బీజేపీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి, ఆ రాష్ట్రాలతో పాటు బిల్లుకు పూర్తి అనుకూలంగా ఉన్న జేడీ-యూ పాలిత బీహార్, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల నుంచి బిల్లుకు మద్దతు లభిస్తుందని భావన. * ఆపై ఈ బిల్లు రాష్ట్రపతి సంతకం కోసం వెళుతుంది. ఆయన ఆమోదముద్ర పడిన తరువాత చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. * తరువాతి ముఖ్యమైన స్టెప్... జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు. కేంద్రం, రాష్ట్రాల ప్రతినిధులతో ఇది ఏర్పాటవుతుంది. బిల్లు చట్టం రూపంలోకి మారిన తరువాతి 60 రోజుల్లో కమిటీ ఏర్పడి ఆర్ఎన్ఆర్ (రెవెన్యూ న్యూట్రల్ రేటు)ను నిర్ణయించడంతో పాటు రాష్ట్రాలకు కలిగే లాభ నష్టాలను బేరీజు వేయాల్సి వుంటుంది. నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రమే పరిహారాన్ని ఇస్తుందన్న సంగతి తెలిసిందే. * ఆర్ఎన్ఆర్ మూడు స్లాబుల్లో జీఎస్టీ రేటు, విధానం, రాయితీలను గురించి చర్చిస్తుంది. నిత్యావసర వస్తువులపై తక్కువ పన్ను, పొగాకు ఉత్పత్తులపై పాపపు పన్ను, లగ్జరీ ఉత్పత్తులపై అధిక పన్ను ఏ మేరకు ఉండాలో నిర్ణయిస్తుంది. * ప్రస్తుతం అమలులో ఉన్న సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, 29 రాష్ట్రాలూ విడివిడిగా అమలు చేస్తున్న స్టేట్ జీఎస్టీ చట్టాలకు కొత్త జీఎస్టీ నిబంధనల మేరకు మార్పులు చేయాల్సి వుంటుంది. తొలి రెండు చట్టాలనూ పార్లమెంటులో, మూడవ దాన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో చర్చించి మార్పులకు ఆమోదం పలకాల్సి వుంటుంది. ఆ తరువాతనే జీఎస్టీ పూర్తిగా అమల్లోకి వచ్చి, దాని మేరకు పన్నుల వసూలు జరుగుతుంది.

  • Loading...

More Telugu News