: జీఎస్టీ 20 శాతమైనా ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉండదు: ఆర్థిక శాఖ


ఎట్టకేలకు రాజ్యసభలో ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను అమల్లోకి వస్తే, ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుందన్న వాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. జీఎస్టీలో భాగంగా 20 శాతం పన్నును వసూలు చేసినప్పటికీ ఇన్ ఫ్లేషన్ పై ప్రభావం ఉండదని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా వెల్లడించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, "వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు చేసే లక్ష్యంతో ఇక ముందడుగు వేస్తాం. ధరలు పెరుగుతాయన్న భయాలు అవసరం లేదు. అన్ని రకాల వస్తు ఉత్పత్తుల ధరలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే ప్రొడక్టులపై మరింత దష్టిని సారిస్తాం" అన్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తీసుకువచ్చిన అతిపెద్ద పన్ను సంస్కరణ ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, జీఎస్టీ రేటు 18 నుంచి 20 శాతం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం ప్రభావితం కాబోదని తెలిపారు. "మా లెక్కల ప్రకారం సరాసరి ద్రవ్యోల్బణం మారదు. అయితే, కొన్ని రకాల కమోడిటీ ఉత్పత్తుల్లో ధరల పెరుగుదల కనిపించవచ్చు. ముఖ్యంగా మరీ పేదవారికి కొంత ఇబ్బంది తలెత్తుతుందేమోనన్న అనుమానముంది. జీఎస్టీ అమలైన తరువాత ద్రవ్యోల్బణం పెరిగితే అది ఆశ్చర్యకరమే" అని అన్నారు. కాగా, గత సంవత్సరంలో సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ, వస్తు సేవల పన్నును 17 నుంచి 18 శాతంగా మాత్రమే ఉంచాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో లో రేట్ ఉత్పత్తులపై 12 శాతం, లగ్జరీ కార్లు, కూల్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ అమలు చేయాలని, బంగారం తదితరాలపై 2 నుంచి 6 శాతం మధ్య పన్ను ఉండాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News