: రాయలసీమకు పట్టిసీమ తొలి ఫలం!... శ్రీశైలం నుంచి 6.2 టీఎంసీల నీటి విదుదలకు దేవినేని ఆదేశం!
విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా... పట్టిసీమ ప్రాజెక్టును ప్రభుత్వం నెలల వ్యవధిలోనే పూర్తి చేసింది. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపి దేశంలోనే నదుల అనుసంధానానికి తొలి అడుగు వేసిన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కారు రికార్డు పుటల్లోకి ఎక్కింది. నాడు పట్టిసీమకు ప్రణాళికలు రచించిన సందర్భంగా ప్రభుత్వం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ ప్రకటనను ఓసారి పరిశీలిస్తే... ‘‘వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తాం. ఆ మేరకు కృష్ణా జలాలను రాయలసీమ జిల్లాలకు అందిస్తాం’’ అంటూ నాడు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఈ ఏడాది కార్యరూపం దాలుస్తోంది. వెరసి రాయలసీమకు పట్టిసీమ ఫలం తొలిసారిగా ఈ ఏడాదే అందుతోంది. వివరాల్లోకెళితే... ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు అందుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు 6.2 టీఎంసీల నీటిని జలవనరుల శాఖ అందిస్తోంది. మరోవైపు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 826 అడుగులకు చేరింది. భారీగా తరలివస్తున్న వరద నీటి కారణంగా జలాశయంలో త్వరలోనే నీటి మట్టం 850 అడుగులకు చేరుకోనుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 850 అడుగులకు చేరగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా, నీటి మట్టం 856 అడుగులకు చేరగానే హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమకు 6.2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చీప్ ఇంజినీర్ జలంధర్ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 6.2 టీఎంసీల నీరు ఇస్తుండగా, అంతే మొత్తంలో శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు 6.2 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న మాట. అంటే పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసే సమయంలో ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం దాల్చినట్లేనన్న మాట. వెరసి రాయలసీమకు పట్టిసీమ ఫలాలు ఈ ఏడాదే అందనున్నాయి.