: పోరు విరామం తాత్కాలికమే!... ‘హోదా’ కోసం ఎంతదాకా అయినా వెళతామన్న కింజరాపు, అవంతి!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము మొదలుపెట్టిన పోరాటానికి తాత్కాలికంగా మాత్రమే విరామమిచ్చామని టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్ చెప్పారు. నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం వారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై మాట్లాడిన సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ త్వరలోనే ఓ కీలక ప్రకటన చేస్తామని చెప్పారని వారు గుర్తు చేశారు. జైట్లీ ప్రకటన నేపథ్యంలో కేంద్రానికి కూడా కాస్తంత సమయం ఇవ్వాలన్న భావనతోనే తమ ఆందోళనలకు తాత్కాలిక విరామం ఇచ్చామని వారు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని వారు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తమ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీల్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తారని వారు చెప్పారు.