: ప్రత్యేకహోదాపై గతంలోనే కేంద్రాన్ని హెచ్చరించా: బాలకృష్ణ
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడుతో పలు అంశాలపై చర్చించారు. హిందూపురంలోనే స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల గురించి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం కేంద్రాన్ని ప్రాధేయపడాల్సిన పని లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని గతంలోనే కేంద్రాన్ని హెచ్చరించానని ఆయన గుర్తుచేశారు. విభజన సమయంలో ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని నినదించిన పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన తెలిపారు. పౌరుషం విషయంలో తెలుగువారు ఎవరికీ తక్కువ కాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని, రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.