: దుబాయ్ దుర్ఘటన... ప్రయాణికుల కోసం వెళ్లి ప్రాణాలర్పించిన ఫైర్ ఫైటర్... నిజంగా హీరో!
ఓ వైపు విమానం క్రాష్ ల్యాండింగ్ అయి, 300 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు గాల్లో రెపరెపలాడుతున్న వేళ, వారిని కాపాడేందుకు ముందుకు దుమికిన అరబ్ ఎమిరేట్స్ ఫైర్ ఫైటర్ ప్రాణాలు కోల్పోయాడు. సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుగా అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్లలో ఒకరు దురదృష్టవశాత్తూ మరణించాడని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అధారిటీ డైరెక్టర్ జనరల్ సైఫ్ అల్-సువైదీ ఓ ప్రకటనలో తెలిపారు. అతన్ని నిజమైన హీరోగా అభివర్ణించారు. కాగా, ఈ విమానంలో భద్రతా లోపాలేమీ లేవని, టేకాఫ్ కు ముందు అన్ని తనిఖీలనూ పైలట్లు చేశారని ఎమిరేట్స్ ప్రతినిధి తెలిపారు. మొత్తం 226 మంది భారతీయులు, 24 మంది బ్రిటన్ వాసులు, 11 మంది అరబ్ పౌరులతో సహా 282 మంది పాసింజర్లు, 18 మంది విమాన సిబ్బందితో తిరువనంతపురం నుంచి దుబాయ్ బయలుదేరిన విమానంలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. విమానం కిందకు దిగిన వెంటనే మరింత మంటలు చెలరేగిన ఈ ఘటనలో 20 మందికి మాత్రం స్వల్ప గాయాలు కాగా, మిగతావారంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డారు.