: రియాల్టీ షోలో ప్రేయసి వేసిన నిప్పుల బాణం గొంతులోకి!
ఓ రియాల్టీ షో జరుగుతున్న వేళ, తనకు కాబోయే భార్య చేసిన ఫీట్ అతని ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. లాస్ ఏంజిల్స్ లో ఎన్బీసీ టీవీ నిర్వహిస్తున్న 'అమెరికాస్ గాట్ టాలెంట్' షోలో కత్తులను గొంతులో దింపుకుని ఒళ్ళు గగుర్పొడిచే ప్రదర్శనలు ఇచ్చే ర్యాన్ స్టాక్ గొంతులోకి ఓ బాణం దూసుకెళ్లింది. తొలుత మూడు కత్తులను గొంతులోకి దించుకునే ఫీట్ చేసిన ర్యాన్ స్టాక్, ఆపై మరో కత్తిని దించుకున్నాడు. దాని పిడికే బాణాలు వేసే టార్గెట్ ఉంది. ఇక అతనికి కాబోయే భార్య అంబర్ లిన్ వాకర్, ఆ టార్గెట్ పై నిప్పంటించిన బాణాన్ని వేయాల్సివుంది. అయితే, ఆ బాణం కాస్తంత గురి తప్పి అతడి మెడలోకి గుచ్చుకుంది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురి కాగా, కాసేపటి తరువాత తాను క్షేమమేనని ర్యాన్ తెలిపాడు. అతనికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని వెల్లడించారు. తన ప్రియురాలు వాడిన విల్లు సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణమని, తాను లక్కీఫెలో కాబట్టే బతికానని ర్యాన్ ట్వీట్ చేశాడు.