: నిమిషం ఆలస్యమై ఉంటే... 300 మంది అగ్నికి ఆహుతి అయ్యేవారే!
నిజమే... ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే... పెను ప్రమాదమే సంభవించేది. బారీ ప్రాణనష్టం తప్పకపోయేది. ఆకాశయానంలో మరో ఘోర ప్రమాదంగా ఈ ఘటన రికార్డుల్లోకెక్కేది. కేవలం 90 సెకన్ల వ్యవధిలో మొత్తం విమానంలోని ప్రయాణికులంతా కిందకు దిగేశారు. అది కూడా అత్యవసర ద్వారం తెరచుకుని మరీ. ఇదంతా నిన్న దుబాయిలో క్రాష్ ల్యాండైన త్రివేండ్రం విమానానికి సంబంధించిన దుర్ఘటన. గాల్లో ఉండగానే విమానం నుంచి పొగలు రాగా... దానిని దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ అత్యవసరంగా దించేశాడు. ఈ క్రమంలో విమానం క్రాష్ ల్యాండైంది. ఎయిర్ పోర్టులో విమానం దిగీ దిగగానే అందులోని దాదాపు 300 మంది క్షణాల్లో కిందకు దిగేశారు. ఇదంతా కేవలం 90 సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. ప్రయాణికులు మొత్తం కిందకు దిగీ దిగగానే విమానం ఇంజిన్ పేలిపోయింది. విమానం మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు కిందకు దిగడం ఏమాత్రం ఆలస్యమైనా భారీ ప్రాణ నష్టమే జరిగిపోయేది. వివరాల్లోకెళితే... కేరళ రాజధాని త్రివేండ్రం నుంచి 282 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో ఫ్లై ఎమిరేట్స్ విమానం ఈకే 521 దుబాయికి బయలుదేరింది. ప్రయాణికుల్లో 226 మంది భారతీయులు, మిగిలినవారు వివిధ దేశాలకు చెందిన వారున్నారు. త్రివేండ్రంలో ఉదయం 10.19 గంటలకు టేకాఫ్ తీసుకున్న ఈ విమానం దుబాయిలో మధ్యాహ్నం 12.50 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. ప్రయాణం మొత్తం సాఫీగానే ముగించిన ఈ విమానం మరికాసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉండగా, ల్యాండింగ్ గేర్ విఫలమైంది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా దించేశాడు. భూమిని తాకుతున్న సమయంలో క్రాష్ ల్యాండైన విమానం రన్ వేను తాకి అంతెత్తున ఎగిరిపడింది. దీంతో విమానం భారీ కుదుపునకు గురైంది. అప్పటికే విమానాన్ని అత్యవసరంగా దించేస్తున్నట్లు పైలట్ ప్రకటించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు విమానం ల్యాండ్ కాగానే అత్యవసర ద్వారం తెరచుకుని క్షణాల్లో బయటపడ్డారు. విమానంలోని మొత్తం 300 మంది 90 సెకన్ల వ్యవధిలోనే కిందకు దిగేయగలిగారు. ప్రయాణికులు దిగీ దిగగానే విమానంలోని ఇంజిన్ పేలిపోయి... విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. వేగంగా స్పందించిన ఎయిర్ పోర్టు సిబ్బంది సదరు మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో ఓ ఫైర్ ఫైటర్ చనిపోయాడు. ఇక విమానంలో నుంచి సురక్షితంగా బయటపడ్డ వారిలో 10 మంది పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు.