: అవినీతి ఆరోపణల్లో మరో రాజకీయవేత్త!... శంకర్ సింగ్ వాఘేలాపై ఈడీ కేసు!
దేశంలో అవినీతికి పాల్పడుతున్న రాజకీయవేత్తల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు రాజకీయ నేతలు అవినీతి ఆరోపణల్లో నిండా మునిగిపోయారు. ఓ వైపు చట్టసభలకు హాజరవుతూనే మరోవైపు తమపై నమోదైన అవినీతి కేసుల విచారణల కోసం కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో జాతీయ స్థాయి నేత చేరిపోయారు. గుజరాత్ కు సీఎంగానే కాకుండా కేంద్ర మంత్రిగానూ పదవీ బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ రాజకీయవేత్త శంకర్ సింగ్ వాఘేలాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. దాదాపు రూ.700 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డట్లు వాఘేలాతో పాటు మరికొందరిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. తొలుత జన సంఘ్ నేతగానే రాజకీయ జీవితం ప్రారంభించిన వాఘేలా ఆ తర్వాత బీజేపీతో నెలకొన్న విభేదాలతో వేరు కుంపటి పెట్టుకుని తదనంతరం దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. యూపీఏ-1 కేబినెట్ లో ఆయన జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు.