: సహారా అధినేతకు మరోసారి ఊరట...సెప్టెంబర్ 16 వరకు పెరోల్ పొడిగింపు
సహారా అధినేత సుబ్రతారాయ్ కు మళ్లీ ఊరట లభించింది. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో మానవీయ కోణంలో సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో పెరోల్ పై జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించింది. ఈ పెరోల్ గడువు ఆగస్టు 3తో ముగియనుంది. పెరోల్ ఇచ్చిన సమయంలో బెయిల్ కావాలంటే 300 కోట్ల రూపాయలు చెల్లించాలని సుప్రీం షరతు విధించింది. దీంతో 500 కోట్ల రూపాయలు చెల్లిస్తానని ఆయన తెలిపారు. పెరోల్ లభించగానే 200 కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన 300 కోట్ల రూపాయల మొత్తం సర్దుబాటు కాకపోవడంతో మరింత సమయం కావాలని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఆయన వినతిని పరిశీలించిన న్యాయస్థానం పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 లోపు హామీ ఇచ్చిన మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జస్టిస్ ఠాకూర్ , జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన బెంచ్ ఆదేశించింది.