: ప్రభుత్వం భేషజాలకు పోకుండా 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి: డీకే అరుణ
జీవో 123ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ నేత డీకే అరుణ అభివర్ణించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు మల్లన్నసాగర్ రైతుల విజయమని అన్నారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలు విడనాడి, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా ప్రభుత్వం చూడాలని ఆమె హితవు పలికారు. హేతుబద్ధమైన భూసేకరణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.