: 123 జీవో కొట్టి వేయడం సంతోషం: జగ్గారెడ్డి
మల్లన్నసాగర్ ప్రాజక్ట్ భూసేకరణకై తీసుకువచ్చిన జీవో నెంబర్ 123ని హైకోర్టు కొట్టివేయడం ముదావహమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 2013 భూసేకరణ చట్టం ఉండగా, దానికి తిలోదకాలిచ్చి, కొత్త జీవోను తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. రైతులు, రైతేతర స్థానికుల ప్రయోజనాలకు పాతరవేసే తీసుకువచ్చిన 123 జీవోను హైకోర్టు కొట్టివేయడం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించాలని, ప్రజాశ్రేయస్సుకు పాటుపడాలని ఆయన సూచించారు. ఈ తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు.