: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నేనొస్తున్నానని చాలెంజ్ చెయ్...!: చంద్రబాబుకి ఉండవల్లి సలహా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసులకు భయపడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, కేవలం రేవంత్ రెడ్డిని కాపాడేందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి లక్ష్మీపార్వతికి వెళ్లిపోతుందేమోనన్న భయంతో రాత్రికి రాత్రి తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేలను, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పదవి సాధించినట్టుగా... రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావాలని ఆయన సూచించారు. చంద్రబాబు ఆలోచనల్లో ఎక్కడో లింక్ కట్టవుతోందని ఆయన ఆరోపించారు. ఈ లింకు కలుపుకుంటే అంతా సెట్ అయిపోతుందని ఆయన చెప్పారు. కేంద్రం వద్ద ప్రత్యేకహోదా కోసం దేబిరించాల్సిన పని లేకుండా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే... యూపీ ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో...ఇలా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారానికి వస్తానని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఎలా తుంగలో తొక్కారో, రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేశారో వివరిస్తానని హెచ్చరించి చూడు...తరువాత ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూడాలని ఆయన చంద్రబాబుకి సూచించారు.

  • Loading...

More Telugu News